టీఎస్‌ఆర్టీసీలో ఏసీ స్లీపర్ బస్సులు!
ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. మారుతున్న జీవన ప్రమాణాలను అనుగుణంగా ప్రజా రవాణాలో మెరుగైన సేవలు, వసతులతో కూడిన ప్రయాణం ను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు సంస్థ ఉన్నతాదికరులు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసి సంస్థ అధునతన స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలో తెస్తోంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.