ఏడు కార్లు దగ్ధం, సెక్యూరిటీగార్డ్ సజీవదహనం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో (Abids) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్యారేజీ (Car garage) మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో ఏడు కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోష్ సజీవదహనం అయ్యాడని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.