టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మరోసారి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై ఆధారాలు ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల నోటీసులు ఇవ్వగా.. బండి సంజయ్ సిట్ ముందు హాజరుకాలేదు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాను ఢిల్లీలో ఉన్నానని, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరుకాలేనంటూ సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు.
శుక్రవారం సిట్ ముందు బండి హాజరుకావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి బండికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు బండి ఎలా స్పందిస్తారు? సిట్ ముందు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. సిట్‌పై తనకు నమ్మకం లేదని, ఆధారాలు ఇవ్వదల్చుకోలేదంటూ శుక్రవారం సిట్‌కు రాసిన లేఖలో బండి పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని, సిట్‌ను తాను విశ్వసించడం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్లు చెప్పారు.