సిట్‌కు సమాచారం ఇవ్వదల్చుకోలేదు: బండి సంజయ్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు వ్యవహారానికి సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్‌కు ఓ లేఖ రాశారు. తాను సిట్‌ను విశ్వసించడం లేదని, తనకు సిట్‌పై అసలు నమ్మకం లేదని చెప్పారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
‘నాకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తా. నాకు సిట్ నోటీసులు ఇప్పటివరకు అందలేదు. మీడియాలో వచ్చే సమాచారం మేరకే నేను స్పందిస్తున్నా. 24వ తేదీన హాజరుకావాలని సిట్ కోరినట్లు నాకు మీడియా ద్వారా తెలిసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరుకావాల్సి ఉంది. నేను ఖచ్చితంగా హాజరుకావాలని భావిస్తే మరో తేదీ చెప్పండి. ఈ విషయంలో నాకు పూర్తి స్వేచ్చ ఉంది’ అంటూ బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.