ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు పడుతున్న బాధలు దృష్టిలో పెట్టుకుని ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం తన ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ ఆనందమే నాకు సంతృప్తిగా ఉంటుంది. వైద్యం, ఆసరా పింఛన్లకు సంబంధించిన సమస్యలు గురించి మీకు సేవ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. వారు మీకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం రూ.40 లక్షలతో పైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రక్రియగా సిద్దిపేట నుంచి ఉచిత కిట్స్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలేరియాతో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మంది పై చిలుకు ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.