పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కో న్యాయం, కాంగ్రెస్ (Congress) కో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఈడీ (ED) కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) వెళ్ళలేదా? అని ప్రశ్నించారు. మరి మమ్మల్ని సిట్ (SIT) వద్దకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో తాను ఆధారాలతో వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. ఆధారాలు సమర్పిస్తే కేసీఆర్ కుటుంబం దోషిగా తేలుతుందని భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ గురువారం సిట్ ముందు హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతల (Congress Leaders)ను పోలీసులు హౌజ్ అరెస్ట్ (House Arrest)లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు సిట్ కార్యాలయానికి తరలివచ్చే అవకాశం ఉందని.. ఇదే జరిగితే గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని పోలీసులు ముందుస్తుగానే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Congress Senior leader Shabbir Ali), మల్లు రవి (Mallu Ravi) సహా పలువురు అగ్రనేతలను గృహనిర్బంధం చేశారు.