ఆ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
వేర్పాటు వాదాన్ని వినిపిస్తూ.. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో చిచ్చు రేపుతున్న ఖలిస్థాన్ నాయకుడు అమృత్పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి కన్నుగప్పి పారిపోయిన వైనంపై తాజాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాదాపు వందకు పైగా పోలీసు వాహనాలతో భారీ ఛేజింగ్ చేపట్టినప్పటికి.. చిక్కినట్లే చిక్కి పారిపోయిన అతడి కోసం పెద్ద ఎత్తున పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయినా.. అతడి ఆచూకీ లభించని పరిస్థితి. ఇలాంటి వేళలో.. పంజాబ్ – హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన స్థాయి సంఘం నివేదికను సమర్పించాల్సిందిగా పేర్కొంది. రాష్ట్రంలోని 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు? అంటూ సూటిగా ప్రశ్నించింది.
‘‘ఇంతమంది పోలీసులు ఉన్నారు? అమృత్పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు? ఇది రాష్ట్ర పోలీసులు.. నిఘా వైఫల్యమే’’ అని మండిపడింది. అమృత్పాల్ సింగ్ ఏర్పాటు చేసిన వారిస్ పంజాబ్ దే సభ్యులపై పోలీసు చర్యపై కోర్టు విచారణ సందర్భంగా ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అతడ్ని అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఆపరేషన్ నిర్వహించినప్పటికీ అతడ్ని మాత్రం పట్టుకోలేకపోయారు. కాకుంటే అతనికి చెందిన కీలక అనుచరుల్ని.. 120 మంది సహచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు పోలీసులు వెల్లడించారు.
అమృత్పాల్ సింగ్ తప్పించుకున్న ఉదంతంపై ఇంతకాలం మాట్లాడని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఈ రోజు (మంగళవారం) తొలిసారి స్పందించారు. దేశానికి వ్యతిరేకంగా పని చేసే ఏ శక్తుల్ని విడిచి పెట్టేది లేదని.. పంజాబ్ ప్రజలు శాంతిని.. ప్రగతిని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఖలిస్థాన్ నేతను పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదన్నారు.