AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్ లీకేజీ కేసు.. హైకోర్టులో విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పిటిషన్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ ధన్కా.. వాదనలు వినిపిస్తూ.. టీఎస్‌పీఎస్సీ మొత్తం 6 ఎగ్జామ్స్‌ను రద్దు చేసిందని చెప్పారు. 5 లక్షల మంది వివిధ పరీక్షలకు అప్లై చేసుకోగా.. మూడున్నర లక్షల మంది గ్రూప్ -1 పరీక్ష రాసినట్లు కోర్టుకు తెలిపారు. గ్రూప్ -1లో 25 వేల మంది ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయినట్లు చెప్పారు. ఈ నెల 18న మీడియా సమావేశంలో ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులు పాల్పడ్డారని కేటీఆర్ చెప్పారని.. ఒక మంత్రిగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని.. సిట్ కాకుండా మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని అన్నారు. ఒకే మండలం నుండి 20 మంది గ్రూప్ -1 పరీక్షల్లో టాప్ స్కోరర్లుగా ఉన్నారన్నారు. వెబ్‌సైట్‌లోనూ ఎక్కడా అభ్యర్థులకు వచ్చిన మార్కులను పొందపరచలేదని చెప్పారు. చాలా మందికి మార్కుల రూపంలో లబ్ధి చేకూర్చారన్నారు. ఈ కేసుపై అనేక అనుమానాలు ఉన్నాయని.. సీబీఐ విచారణకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. గతంలో వ్యాపం కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించిన సందర్భంగాన్ని గుర్తు చేశారు.

అనంతరం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తన వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ విచారణ పారదర్శకంగా జరగుతోందని.. అలాంటి సమయంలో సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. పిటిషన్ వేసిన వాళ్లకు ఈ ఎగ్జామ్ రద్దుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారన్నారు. పిటిషన్‌కు లోకస్ స్టాండ్ లేదు కాబట్టి పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రతి ఒక్కరూ ఇలా పిటిషన్లు వేయటం కామనైపోయిందన్నారు. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని.. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో కొన్ని మండలాలకు వెళ్లి లోతైన విచారణ జరపుతున్నారన్నారు. ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం ఈనెల 18 నుంచి 23 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకే పరీక్షలను రద్దు చేసినట్లు ఏజీ కోర్టుకు వివరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10