నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై తెల్లవారుజామున చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు ఆవుల మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా… మరో 6 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. నేరేడుగొమ్మ మండలం కాసరాజుపల్లి గ్రామానికి చెందిన రామావత్ రాము, రామావత్ భిక్కన్‌తో పాటు మరికొందరు కలిసి ఆవులు మేపుతూ.. జీవనం కొనసాగిస్తుంటారు. ఊరురా తిప్పుతూ మూగజీవాలను మేపుతుంటారు. రోజూలాగే నిన్న కూడా ఆవులను మేపేందుకు ఆవులను తోలుకుని వేములపల్లి వైపు వచ్చారు. చీకటి పడడంతో రాత్రికి బుగ్గబావి గూడెం వద్దే ఉన్నారు. అయితే.. ఈరోజు తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన బస్సు.. ఆవులను ఢీకొంది. ఈ క్రమంలో 14 గోవులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.
కుటుంబానికి దూరంగా ఉంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఆవులు.. తమకళ్ల ముందే చనిపోవడంతో రైతులు తీవ్రంగా రోధించారు. రైతులు రోధించటం చూసి.. చూపరులు కూడా కంటతడిపెట్టుకున్నారు. ఒకొక్క ఆవు ధర రూ.50 వేలు వరకు ఉంటుందని.. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.9 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానిపై కఠిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.