తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపై విషాదం చోటు చేసుకుంది. ఆలయ పుష్కరిణిలో మునిగి ఓ భక్తుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమర చింతల గ్రామానికి చెందిన మౌలాలి (19)నిన్న (సోమవారం) సాయంత్రం తల్లితో పాటు యాదాద్రి దర్శనానికి వచ్చాడు.
రాత్రి కొండపైనే బస చేసి.. ఉదయం 7 గంటల సమయంలో స్నానం చేసేందుకు గాను పుష్కరిణలోకి దిగాడు. పుష్కరిణిలో స్నానం చేస్తుండగా.. మౌలాలికి ఫిట్స్ వచ్చింది. దీంతో అతడు నీటిలో మనిగిపోయాడు. నీటి లోతు తక్కువగానే ఉన్నా.. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవటంతో నీళ్లలో మునిగి చనిపోయాడు. కాసేపటికి తల్లి వెళ్లి చూడగా.. అతడు విగతజీవిగా పడి ఉన్నాడు.