సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు నిందితులను సుదీర్ఘంగా విచారించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన రేణుక, ప్రవీణ్, రాజశేఖర్ ను అధికారులు విడివిడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిట్ కు కొత్త లింకుల గురించి విషయాలు తెలిసినట్లు సమాచారం. వారి వాట్సప్ చాటింగ్ లను రిట్రీవ్ చేయగా.. అందులో కొత్త విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన అధికారులు నిందితుల పరిచయాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. అలాగే కీలక నిందితునిగా ఉన్న రాజశేఖర్ పాత్రకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాట్సప్ చాటింగ్ ను వారి ముందు ఉంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ చాలా మందికి పేపర్ లీక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ కుట్రపూరితంగానే పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రవీణ్, రాజశేఖర్ కంప్యూటర్ నుండి డేటాను రిట్రీవ్ చేశారు. దీని ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
టెక్నీకల్ ఆఫీసర్ గా ఉన్న రాజశేఖర్ డిప్యుటేషన్ పై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా వచ్చాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తో సంబంధాలు కొనసాగించాడు. ఆ తరువాత కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ ను దొంగిలించినట్లు గుర్తించారు. శంకర్ లక్ష్మీ తాను పాస్ వర్డ్ ఎక్కడ రాయలేదని..చెప్పలేదని చెప్పడంతో రాజశేఖర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ దొంగిలించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తరువాత ఓ పెన్ డ్రైవ్ లో 5 పరీక్ష పత్రాలను రాజశేఖర్ కాపీ చేసుకున్నాడు. అనంతరం ఆ పెన్ డ్రైవ్ ను ప్రవీణ్ కు ఇచ్చాడు.
ఈ క్రమంలో ప్రవీణ్ ఏఈ హెగ్జామ్ పేపర్ ను రేణుకకు లీక్ చేశాడు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ పేపర్ ను కాపీ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు సిట్ గుర్తించింది. అలాగే ప్రవీణ్ కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు రావడంపై కూడా అధికారులు కూపీ లాగారు. సెక్రటరీ దగ్గర పీఏగా ఉంటూ గ్రూప్ 1 పేపర్ కొట్టేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరి రానున్న రోజుల్లో సిట్ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.