సీఎంవో ఆదేశాలతో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ జరిగిందని బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరించి సమావేశాల్ని ప్రారంభించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు తమ ఉద్యమం ఆగదన్నారు. మార్చి 20న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష చేస్తామన్నారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల భృతి, పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్లతో దీక్ష జరుగుతుందన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వల్ల 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ కు హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న ఆకృత్యాలపై కేసీఆర్ స్పందించడని.. రాష్ట్రంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదన్నారు. ఏ శాఖ అయినా మంత్రి కేటీఆరే మాట్లాడుతారని సంజయ్ అన్నారు.