రాజశేఖర్ కు ఉద్యోగం వచ్చింది కేటీఆర్ పీఏ వల్లే!
మంత్రిని జైల్లో పెట్టాలని డిమాండ్
పేపర్ లీకేజీని నిరసిస్తూ రేవంత్ దీక్ష
పేపర్ లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ చెప్పడంతోనే నిందితుడు రాజశేఖర్ కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని ఆరోపించారు. పేపర్ లీక్ వ్యవహారం అంతా నడిపింది కేటీఆర్ పీఏ అని సంచలన ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రేవంత్ నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు.
దీక్షలో భాగంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం కాదని.. చంచల్ గూడ జైల్లో పెట్టాలని అన్నారు. లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ కు కేటీఆర్ షాడో సీఎం అయితే.. కేటీఆర్ కు ఆయన పీఏ షాడో మంత్రి అంటూ మండిపడ్డారు.
2015 నుండి ఇప్పటి వరకు జరిగిన పోటీ పరీక్షలో కొందరికి లబ్ధి జరిగిందని ఆరోపించారు రేవంత్. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో వందకు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ, నిందితుడు రాజశేఖర్ ఊర్లు పక్కపక్కనే అని.. వారిద్దరికి సన్నిహితులైన వారికి అత్యధిక మార్కులు వచ్చాయని వివరించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అసలు, టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. గతంలో ఇలాగే గ్రూప్-2 రాసిన మాధురికి ఫస్ట్ ర్యాంక్.. రజినీకాంత్ అనే వ్యక్తికి 4వ ర్యాంక్ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు రేవంత్ రెడ్డి. పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కాంగ్రెస్ ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ దీక్షకు పూనుకున్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు, దిష్టిబొమ్మల దగ్ధానికి రేవంత్ పిలుపునివ్వడంతో రోడ్డెక్కారు నేతలు.