AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాల్సిందే

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలంటూ గన్‌పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. బండి ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులపై బీజేపీ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి వెళ్తాం.. దమ్ముంటే ఆపండి’’ అంటూ పోలీసులకు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తల ఇండ్లల్లో చొరబడి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంను హెచ్చరిస్తున్నా… మా బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రగతి భవన్‌ ను ముట్టడిస్తామని అన్నారు. పోలీసుల అనుమతి తీసుకుని.. గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించాలా అని ప్రశ్నించారు. సీఎం కొడుకు నిర్వాకం వల్లే పేపర్ లీకేజీ అయ్యిందని ఆరోపణలు గుప్పించారు. ధరణి పోర్టల్ అక్రమాల్లోనూ సీఎం కొడుకు హస్తం ఉందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా అని నిలదీశారు. ‘‘లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే… దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు కేబినెట్ అంతా ఢిల్లీ వెళతారా?.. మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా?’’ అంటూ ఆయన నిప్పులు చెరిగారు.

కేసీఆర్ పాలనలో నీళ్లు – నిధులు – నియామకాల్లోనూ అక్రమాలే అని అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అని అన్నారు. దగుల్బాజీ రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో… అందుకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమే అని… దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్‌ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్…. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘నీకు సిగ్గుంటే.. నీతి నిజాయితీ ఉంటే నీ కొడుకును మెడలు పట్టి కేబినెట్ నుండి తొలగించేయ్’’ అంటూ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సిట్ విచారణ ఓ ఫాల్స్ అని… కేసీఆర్ సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అనడమే సిట్ పని అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని పట్టుబట్టారు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి సరైన తిండిలేక, వసతి లేక కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ల జీవితాలను చిద్రం చేస్తారా అని అన్నారు. టీఎస్సీఎస్సీ ఛైర్మన్ ఎవరిని నమ్మి మోసపోయారో స్పష్టం చేయాలన్నారు. టీఎస్సీస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాల్సిందే అని అన్నారు. అరెస్టుల విషయంలో కేటీఆర్ కో న్యాయం? సామాన్యులకో న్యాయమా? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ యువత, కార్మికులు, ఉద్యోగులందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10