దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. సీబీఐ తనను అరెస్టు చేయకూడదని.. ఈ అంశంలో విచారణ కూడా చేయొద్దంటూ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ పిటిషన్లను కొట్టేసింది.
తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని.. వీటిని అత్యవసరంగా విచారించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ అవినాష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 16 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని.. బలవంతపు చర్యలు ఏమీ తీసుకోవద్దని మూడు రోజుల క్రితం హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా మార్చి 17న తీర్పు ఇచ్చిన హైకోర్టు అవినాష్రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతించింది. అయితే అవినాష్ రెడ్డి కోరినట్టు విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. మరోవైపు అవినాష్ రెడ్డి కోరినట్టు ఆయన న్యాయవాదిని విచారణ జరిగే చోటకు అనుమతించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు అవినాష్రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు రద్దు చేసింది.
కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ విన్నవించారు. అంతేగాకుండా తనను విచారిస్తున్నప్పుడు ఆడియో వీడియోల ద్వారా రికార్డు చేయాలని కోరారు. మొదటిసారి జనవరి 28 ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో వీడియో రికార్డు చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చారు.