ఇకపై జరుగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలని భావిస్తున్నది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల కోసం ఇప్పటికే కొన్ని ప్రశ్నపత్రాలు సిద్ధం చేయగా, మరికొన్ని ప్రశ్నల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేయాలని కమిషన్ నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలు ఎంపిక చేయాలని అనుకుంటున్నది. సాధారణంగా.. ప్రశ్నల ఎంపికకు కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటివన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌కు సైతం ఒకరికి మరొకరికి సంబంధం ఉండదు. కొన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రశ్నపత్రాలతోపాటు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను సైతం మార్చాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది.