ఈడీకి కవిత లేఖ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈదయం 11 గంటలకు ఆమె ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం పంపించారు. తనకు జారీ చేసిన నోటీసులపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని.., ఆ పిటిషన్ విచారణ ఈనెల 24న వస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండటంతో పాటు అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది సోమా భరత్ ద్వారా కవిత ఈడీకి సమాచారం పంపింది.
దాంతో పాటు ఈనెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను భరత్ ద్వారా కవిత ఈడీ అధికారులకు పంపించారు. ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. చాలా సేపటి వరకు ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో కవిత ఈడీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మేరకు విచారణకు హాజరు కాలేనని సమాచారాన్ని పంపించారు. కవితను తీసుకెళ్లేందుకు గాను ఉదయమే ఈడీకి చెందిన సెక్యూరిటీ వాహనం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకుంది. ఆమె విచారణకు హాజరు కాలేనని తెలిపిన వెంటనే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కవత విజ్ఞప్తిపై ఈడీ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.