ఢిల్లీ : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డులు రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కళ కల కోసం కాదు… ప్రజల కోసమన్నారు. ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్, ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవార్డులు రావడం మనకు గర్వకారణమన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పోట్లగిత్తల్లా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారని నారాయణ పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాలపై…
హోంమంత్రి ఆఫీస్ నుంచి పార్లమెంట్ సభ్యులకు వార్నింగ్ ఇస్తున్నారని.. పార్లమెంట్ ఆవరణలో సభ్యులకు నిరసన తెలిపే హక్కు లేదా? అని నారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా ఎక్కడా ఉల్లంఘనలకు పాల్పడటం లేదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నది మోదీ ప్రభుత్వమేనన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన వార్నింగ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని నారాయణ హెచ్చరించారు.