తెలుగు సినీ చరిత్రలో లిఖించుకోదగ్గ రోజు ఇది. భారతీయ సినీ చరిత్రలో మరపురాని ఘట్టం. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సాకారం చేసింది. ఆస్కార్ అడుగుదూరంలో కాదు.. అరచేతిలోనే ఉందని విశ్లేషకులు చెప్పిన మాట నిజమైంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకును అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా కల నెరవేరింది.
లాస్ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుకగా ఘనంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగీరిలో పోటీ పడిన ‘అప్ల్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ దక్కించుకుంది. అవార్డును ప్రకటించగానే డాల్జీ థియేటర్ చప్పట్లతో మార్మోగిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభ్కైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనతో డాల్బీ థియేటర్లో ఉన్న సినీతారలను, ఆహుతులను ఉర్రూతలూగించారు.