హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నాటు నాటు…’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల టీపీపీసీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జక్కన్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం. సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
లాస్ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగీరిలో పోటీ పడిన ‘అప్ల్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ దక్కించుకుంది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించింది.