హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో కోర్టులో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీసీ కెమెరాల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. కోడికత్తి కేసు లో ఎయిర్ పోర్టులో 30 కెమెరాలు పనిచేయడం లేదని సీఐఎస్‌ఎఫ్ కోర్టుకు తెలియజేసిందని అన్నారు. సీబీఐ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు బిగించాలన్న స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. మొత్తం రికార్డులు, ఫైల్ సమర్పించాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సమయంలో రికార్డ్ చేసిన వీడియోలను సోమవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వీడియో గ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్ చేశారో లేదో ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తెలపాలని పేర్కొంది. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.
కాగా… ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్‌పై వాదనలు మొదలవగా… అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన సీబీఐ విచారణకు వెళ్లారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24వ తారీఖున చేసిన విచారణ స్టేట్‌మెంట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. ఈ రోజు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్‌మెంట్స్‌ను పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది కోరారు. రెండుసార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా ఉందన్నారు. రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి నుంచి సంతకాలు తీసుకోలేదన్నారు. 40 నుంచి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్‌మెంట్లు మార్చి ఉండొచ్చని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డినే అని పేర్కొన్నారు. అవినాష్ ను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అవినాష్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణ కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇప్పటి వరకు సహకరించామని.. ఇక ముందు కూడా సహకరిస్తామని అవినాష్ రెడ్డి తరుపు లాయర్ కోర్టుకు వెల్లడించారు.