భారత నౌకాదళం ఇటీవల చేపట్టిన కీలక మిషన్ ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్థాన్‌పై కేవలం సైనికపరంగానే కాకుండా, ఆర్థికంగానూ తీవ్ర ఒత్తిడిని తెచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి తెలిపారు. మే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది.
‘ఆపరేషన్ సింధూర్’లో భారత నౌకాదళం క్యారియర్ యుద్ధ సమూహాన్ని మోహరించడం సహా దూకుడుగా వ్యవహరించడం వల్ల పాకిస్థాన్ నౌకాదళం తమ నౌకలను పోర్టులకే పరిమితం చేయాల్సి వచ్చిందని అడ్మిరల్ త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయిందని, అంతేకాకుండా ఈ కీలక ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
‘ఆపరేషన్ సింధూర్’ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, గణనీయమైన సంఖ్యలో వాణిజ్య నౌకలు పాకిస్థాన్‌కు ప్రయాణించడానికి నిరాకరించాయి. అలాగే, పాకిస్థాన్‌కు ప్రయాణించే నౌకల భీమా వ్యయం (Insurance Cost) కూడా పెరిగిందని, తద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడిందని నేవీ చీఫ్ వివరించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌లు కూడా ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోందని, పాకిస్థాన్ దాడికి పాల్పడితే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఉంటుందని హెచ్చరించారు.








