పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని దుయ్యబట్టిన మోడీ, డ్రామాలు వద్దు, చట్టసభల్లో చర్చలు తప్పనిసరి అని హితవు పలికారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలని ఆయన కోరారు. వికసిత్ భారత్ దిశగా దేశం ముందు అడుగు వేస్తోందని ఆయన లోక్‌సభకు హాజరై ప్రకటించారు.
ఈ 15 రోజుల శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురాబోతోంది. మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా, వాటిలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు తలుపులు తెరిచే అణు ఇంధన బిల్లు, ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసే ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు’ కీలకంగా ఉన్నాయి. ఈ సంస్కరణ బిల్లులు రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళనలు పెంచడంతో, ప్రతిపక్షాలు వీటిపై ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు విపక్షాలు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై వాయిదా తీర్మానం కోరాయి. జాతీయ భద్రత, రైతు సమస్యలు, ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్‌లపై కూడా ప్రభుత్వంపై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నాయి. పార్లమెంట్‌కు ముందు ఇండి కూటమి నేతలు సమావేశమై సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు.








