తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, కొండారెడ్డిపల్లిలో సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు మల్లేపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వెంకటయ్య 1972లో జన్మించి, 1994లో మావోయిస్టుల పాటలకు ఆకర్షితుడై పార్టీ కార్యకర్తగా చేరారు. 2000 వరకు కల్వకుర్తి, గంగన్న, పాల్గల్ ప్రాంతాల్లో చురుకుగా పనిచేశారు. 2001లో వెంకటయ్య కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి, ఆ తర్వాత సామాన్య జీవితంలోకి వచ్చారు. 2003లో అదే పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా ఎంపికై అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఈయన సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి సన్నిహితులు.
కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో, హోం గార్డు పదవికి రాజీనామా చేసి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సర్పంచ్ పదవితో పాటు, గ్రామంలోని 10 వార్డులకు కూడా ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేశారు, అవి కూడా ఏకగ్రీవం అయ్యాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్టంలో ఆదర్శ గ్రామంగా మార్చేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా వెంకటయ్య తెలిపారు.









