టీమిండియా వెటరన్ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఐపీఎల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య మూడు సార్లు ట్రేడ్ అయిన ఏకైక ఆటగాడిగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజా ట్రేడింగ్‌లో ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి ముంబై ఇండియన్స్ (MI) రూ. 2 కోట్ల క్యాష్ డీల్ ద్వారా ట్రేడ్ చేసుకుంది.
శార్దూల్ ఠాకూర్ గతంలోనూ రెండుసార్లు ట్రేడ్ అయ్యాడు. ఐపీఎల్ 2017 సీజన్‌లో తొలిసారిగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఆయన్ను ట్రేడ్ చేసుకుంది. ఆ తర్వాత 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ఆయన్ను ట్రేడింగ్ ద్వారా తీసుకుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో, మినీ వేలానికి ముందే మూడు సార్లు జట్టు మారిన ఆటగాడిగా ఆయన రికార్డ్ సృష్టించారు.
వాస్తవానికి, ఐపీఎల్ 2025 మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. అయితే, సీజన్ ప్రారంభానికి ముందు గాయం కారణంగా తప్పుకున్న ఆటగాడి స్థానంలో ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్ల కనీస ధర చెల్లించి ఆయన్ను తీసుకుంది. ఆ సీజన్‌లో శార్దూల్ అసాధారణ ప్రదర్శన కనబర్చి, 10 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టడంతో ముంబై ఇండియన్స్ ఆయన్ను ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది.








