ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ (NTR Baby Kits) అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మాతా శిశు సంరక్షణ (MCH)కు ప్రాధాన్యతనిస్తూ, నవజాత శిశు సంరక్షణకు అవసరమైన వస్తువులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కూటమి ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు 3.50 లక్షల మందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కిట్ల సరఫరా బాధ్యతను జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకోసం టెండర్ ప్రక్రియ నిర్వహించగా, నాలుగు బిడ్లు రాగా.. వాటిలో మూడింటిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హామీలను వేగంగా అమలు చేయడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంగా తెలుస్తోంది.
ఈ ఎన్టీఆర్ బేబీ కిట్లలో బ్యాగు, దోమతెర (Mosquito Net), పోల్డబుల్ బెడ్ (Foldable Bed) సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి. ఈ కిట్ల ద్వారా బాలింతలకు మరియు నవజాత శిశువులకు అవసరమైన ప్రాథమిక వసతులను కల్పించడం ప్రభుత్వ ఉద్దేశం. ప్రజలకు పలు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఒక్కో గ్యారంటీని అమల్లోకి తీసుకువస్తూ ముందుకు సాగుతోంది.








