ఢిల్లీలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో 13 మంది వరకు మరణించిన నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు మరోసారి అప్రమత్తమై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యలలో భాగంగా, బాంబ్ స్క్వాడ్ బృందాలు నగరంలో విస్తృత తనిఖీలను ప్రారంభించాయి. షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, దేవాలయాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ తనిఖీలలో అనుమానిత వస్తువులు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేశారు. అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులు కానీ, లేదా అనుమానిత వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే 100 నెంబరుకు డయల్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.
అలాగే, నగరంలో ఎవరైనా కొత్తగా అద్దెకు దిగిన వారు అనుమానాస్పదంగా ఉన్నా లేదా వ్యవహరిస్తున్నా, ఆ సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ హై అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పోలీసులకు సహకరించాలని కోరారు.








