AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ కారు బాంబు దాడి: మృతుల సంఖ్య 12కు చేరిక; కుట్రదారులను వదలబోమని ప్రధాని మోదీ హెచ్చరిక

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో తొలుత 9 మంది మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ భయంకరమైన సంఘటన నేపథ్యంలో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించగా, పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై మంగళవారం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

భూటాన్ రాజధాని థింపులో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “భయంకరమైన ఈ సంఘటన అందరినీ బాధపెట్టింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్‌కు వచ్చాను. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుంది” అని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కఠిన హెచ్చరిక చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, దాడికి గల కారణాలను త్వరలోనే అధికారులు వెల్లడించనున్నారని పేర్కొన్నారు. “ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని” ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు.

 

ANN TOP 10