AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ మహిళలకు శుభవార్త: ఇందిరా జయంతి సందర్భంగా నవంబర్ 19న చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన వారికి చీరలను కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి, ఈ చీరలను దసరా, బతుకమ్మ సంబరాల సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేయాలని డీఆర్డీవో అధికారులకు ఆదేశాలు అందాయి.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టనుంది. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలకు ‘అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక’ పేరుతో ఏడాదికి రెండు చేనేత చీరలను అందించనున్నారు. గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డులో ఉన్నవారికి ఒక చీర చొప్పున సరఫరా చేయగా, ఈసారి పొదుపు సంఘాల సభ్యులందరికీ పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకుని గోదాముల్లో భద్రపరిచారు.

గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు, తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది SHC (Self Help Group) మహిళలకు ఈ చీరలను ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలను గౌరవించడంతో పాటు, రాష్ట్ర చేనేత రంగాన్ని ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

 

ANN TOP 10