AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవి అందెశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రముఖ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ, ఈరోజు ఉదయం ఇంట్లో కుప్పకూలిపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 7:25 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ అశువు కవిత్వం చెప్పడంలో దిట్ట. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా ఇటీవలే ప్రభుత్వం నుంచి రూ. కోటి పురస్కారం అందుకున్నారు. అంతేకాక, కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. ఆయనకు 2006లో ‘గంగ’ సినిమాకు నంది పురస్కారం లభించింది. అలాగే, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం సహా అనేక అవార్డులు అందుకున్నారు.

ఉదయం ఆయన మరణవార్తతో తెలుగు సాహితీ, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో, తెలంగాణ ఆత్మను తన రచనల ద్వారా ప్రతిబింబించిన ఆ గొప్ప కవికి తగిన గౌరవం దక్కినట్లయింది.

 

ANN TOP 10