AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ పాలనకు పరీక్షగా మారిన సిట్టింగ్ సీటు పోరు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్‌గా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే, తన పాలనపై వస్తున్న అన్ని అనుమానాలకు చెక్ పెట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ కీలకమైన సిట్టింగ్ సీటులో ఏ మాత్రం తేడా వచ్చినా, అది పార్టీ పరంగా రేవంత్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు దారితీస్తుంది. అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి స్వయంగా బస్తీ పర్యటనలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

నిజానికి, ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా ప్రత్యర్థులు మరియు కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలో ఉండి ఉప ఎన్నికలో పార్టీకి విజయం సాధించి పెట్టకపోతే వచ్చే విమర్శలను రేవంత్ రెడ్డి తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టే, తనతో పాటు మంత్రివర్గాన్ని మొత్తాన్ని ప్రచారంలోకి దించారు. అంతేకాక, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ ఫలితం ప్రభావం చూపుతుందనే వ్యూహంతో రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.

సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే వచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు లక్షన్నర మంది ఉన్న ముస్లిం సామాజికవర్గ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఎంఐఎం మద్దతు తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, ఆంధ్ర ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, సినీ కార్మికులకు వరాలు వంటి చర్యలతో ముందుకు వెళుతున్నారు. ఈ వ్యూహాలు చివరకు ఓటర్ల తీర్పును ఎలా మారుస్తాయో చూడాలి.

 

ANN TOP 10