AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: షెల్టర్లకు తరలించాలి, ప్రభుత్వ ప్రాంగణాలు రక్షించాలి

దేశవ్యాప్తంగా వీధి కుక్కల కాట్ల కేసులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా రవాణా కేంద్రాల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స (Sterilization) చేయించి, వ్యాక్సిన్ వేయించాలని కోర్టు ఆదేశించింది. అయితే, శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది.

శస్త్రచికిత్స తర్వాత వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వైద్య సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా మైదానాలను గుర్తించాలని, 8 వారాల్లో వాటిని ఫెన్సింగ్‌లతో కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ సందర్భంగా కోర్టు జంతు జనన నియంత్రణ నిబంధనలు (ABC నియమాలు 2023) అమలులో ఉన్న నిర్లక్ష్యాన్ని విమర్శించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలు, సంస్థల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారనే నివేదికలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవతా దృక్పథం, ప్రజా భద్రత మధ్య సమతుల్యత అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇండియన్ నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) సహా ఇతర రహదారి సంస్థలు రోడ్లపై ఉండే ఇతర పశువులను కూడా షెల్టర్లలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

 

ANN TOP 10