AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ‘సూరి’ గ్యాంగ్ అరెస్ట్: నేరాల చిట్టా తెరిస్తే షాక్!

తెలంగాణ రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరుగాంచిన రౌడీ షీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి మరోసారి వరంగల్ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో సహా ఐదు జిల్లాలలో ఇతనిపై ఏకంగా 46 కేసులు ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. సుఫారీ హత్యలు, భార్య, బావమరిది హత్యలు, దారిదోపిడీ దొంగతనాలు వంటి అనేక దారుణాలకు పాల్పడిన సూరి నేర చరిత్రను తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. రాచకొండ పోలీసులు నగర బహిష్కరణ చేసినప్పటికీ, సూరి వరంగల్‌కు వచ్చి హనుమకొండలోని భీమారంలో తిష్టవేసి, కొత్త తరహా దందాలను, నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించాడు.

అరెస్టయి జైలుకు వెళ్లిన ప్రతిసారి కొత్త నేరస్తులతో దోస్తీ కట్టి, సరికొత్త నేరాలకు స్కెచ్ వేయడం సూరి నైజం. ఈసారి కూడా అతను జైల్లో పరిచయమైన ఆదిత్యకుమార్ ఠాకూర్ ద్వారా బీహార్‌లోని భాగల్పూర్ నుండి రెండు పిస్టల్స్, బుల్లెట్స్, కత్తిని కొనుగోలు చేసి, ఇక్కడ మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. భూపాలపల్లిలో ఒక హత్యకు సుపారి తీసుకున్న ఈ గ్యాంగ్, మార్గమధ్యలో హనుమకొండ జిల్లా మాందారిపేట వద్ద ఓ లారీ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడింది. లారీ డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సూరితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.

ఈ గ్యాంగ్ గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, వారి వద్ద నుంచి 2 రివాల్వర్లు, కత్తులు, మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడుసార్లు పీడీ యాక్ట్ ఎదుర్కొన్న ఏకైక నేరస్తుడిగా సూరిపై ప్రత్యేక ముద్ర ఉంది. ఈ నేరాల నేపథ్యంలో సూరి గ్యాంగ్‌పై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. వరంగల్ నగరంలో ఇలాంటి రౌడీషీటర్ల తోకలు కత్తిరిస్తామని, నేరాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

 

ANN TOP 10