లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ ఎన్నికల చోరీలతో ప్రధానమంత్రి పదవిలోకి వచ్చారని, బీజేపీ వ్యవస్థీకృతంగా ఎన్నికల చోరీలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘హెచ్-ఫైల్స్’ మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్, “నరేంద్ర మోదీ ఎన్నికలను ఎలా దొంగిలించి ప్రధాని అయ్యారో జెన్ జీ యువతకు (Gen Z) స్పష్టంగా వివరిస్తాం. ఈ నిజాన్ని దేశ యువత ముందు ఆధారాలతో సహా ఉంచుతాం” అని స్పష్టం చేశారు.
నకిలీ ఓట్లు, ఓటర్ల జాబితాలో నకిలీ ఫొటోలు వంటి అంశాలపై తాను చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. తాము చూపుతున్న ఆధారాలన్నీ ఈసీ నుంచే సేకరించినవే అని తెలిపారు. ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన లారిస్సా నెరీ అనే మహిళ ఫొటోను చేర్చడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని రాహుల్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో లారిస్సా నెరీ కూడా ఒక వీడియో ద్వారా స్పందిస్తూ, ఎవరో తన పాత ఫొటోను భారత ఎన్నికల కోసం వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
అసలు సమస్య నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎన్నికల సంఘం కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తుండటమే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒకే వ్యక్తి బహుళ ఓట్లు వేయడం, ఒకే బూత్‌లో ఒక మహిళకు 200 ఫొటోలు ఉండటం వంటివి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, గుజరాత్‌లలో జరిగాయని, ఇప్పుడు బీహార్‌లోనూ అదే చేయబోతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికలను దొంగిలిస్తోంది, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని రాహుల్ పునరుద్ఘాటించారు.









