AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండెకరాల పంట నష్టానికి రూ.6 నష్టపరిహారం: మహారాష్ట్ర రైతు ఆవేదన

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాకు చెందిన రైతు దిగంబర్ సుధాకర్ తంగ్డేకు భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టం పోతే ప్రభుత్వం నుంచి కేవలం 6 రూపాయలు మాత్రమే నష్టపరిహారం అందింది. పైథాన్ తాలూకాలోని దావర్వాడి గ్రామానికి చెందిన తంగ్డే, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే పర్యటన సందర్భంగా ఈ దారుణమైన అనుభవాన్ని వెల్లడించారు. ఈ పరిహారం తమకు అవమానకరమైనదిగా, ఎగతాళి చేయడమేనని రైతులు మండిపడుతున్నారు.

“నాకు 2 ఎకరాల భూమి ఉంది. పంట పోతే.. పరిహారంగా నా బ్యాంకు ఖాతాలో 6 రూపాయలు మాత్రమే జమ అయ్యింది. ఇంత తక్కువ చెల్లించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ డబ్బు నాకు ఒక కప్పు టీ కొనడానికి కూడా సరిపోదు,” అని రైతు సుధాకర్ తంగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా పరిహారం కోసం ఎదురుచూసిన రైతులు, ఇంత తక్కువ మొత్తం రావడంతో, ప్రభుత్వం తమతో పెద్ద జోక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ డబ్బును తిప్పి పంపుతున్నారు.

ఇదే తరహా అనుభవం గతంలో అకోలా జిల్లాలోని రైతులకు కూడా ఎదురైంది. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన వారికి కేంద్ర బీమా పథకం కింద కేవలం 3 రూపాయలు, 21 రూపాయలు మాత్రమే పరిహారంగా అందింది. దీనిపై ఆగ్రహించిన రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వచ్చిన చెక్కుల మొత్తాలను తిరిగి ఇచ్చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో బాధిత రైతులకు రూ.31,628 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది.

 

ANN TOP 10