మద్యం వినియోగంలో తెలుగు రాష్ట్రాల కంటే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు ముందున్నాయి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) వెల్లడించిన వివరాల ప్రకారం, IMFL (India Made Foreign Liquor) అంటే విస్కీ, రమ్, వోడ్కా, జిన్, బ్రాందీ ఉత్పత్తుల విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40.17 కోట్ల IMFL కేసులు అమ్ముడవగా, దేశంలో జరిగిన మొత్తం అమ్మకాల్లో 58 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి.
మద్యం అమ్మకాల్లో కర్ణాటక (6.88 కోట్ల కేసులు) దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాత స్థానంలో తమిళనాడు (6.47 కోట్ల కేసులు) ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణ (3.71 కోట్ల కేసులు) మూడో స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ (3.55 కోట్ల కేసులు) నాలుగో స్థానంలో నిలిచాయి. దీనికి విరుద్ధంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో IMFL విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం 2.50 కోట్ల కేసుల విక్రయాలు మాత్రమే జరిగి, ఆరో స్థానంలో ఉంది.
మద్యం అమ్మకాలు ఎక్కువగా జరగడానికి అధిక ఆదాయం, పట్టణ జీవనశైలి, సాంస్కృతిక కారణాలు (Cultural Reasons) వంటి అంశాలు కారణంగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శుభకార్యమైనా, అశుభకార్యమైనా మందు, మాంసం తప్పనిసరి అనే కల్చర్ ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తుండగా, తెలంగాణలో 6.7 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారని CIABC నివేదిక వెల్లడించింది.









