జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనలో, తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కన్న కుమార్తెను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లాకు చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ప్రియాంక ఈ ఏడాది జులై 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాకేష్‌ను పెళ్లి చేసుకుంది.
కుమార్తె పెళ్లి చేసుకున్న విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు, ఆమె రెండు నెలల గర్భిణీ అని తెలుసుకుని కుట్ర పన్నారు. మొదట బాగానే మాట్లాడి, మంచిగా బతకమని చెప్పి, భర్త నుంచి వేరుచేసేందుకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చెకప్ కోసం తీసుకెళ్లే నెపంతో తల్లి ప్రియాంకను నమ్మించింది. ఆస్పత్రిలో డాక్టర్‌ను కలిసి తిరిగి వస్తుండగా, వాష్ రూమ్ వస్తుందనే నెపంతో తల్లి ప్రియాంక అత్తను తీసుకుని దూరంగా వెళ్లిపోయింది.
అదే సమయంలో ప్రియాంక తండ్రి, ఆమె బావ కలిసి కారులో వచ్చి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ప్రియాంక స్థానికుల సాయంతో వారి నుంచి తప్పించుకుని 100కు డయల్ చేసి పోలీసులను ఆశ్రయించింది. తన తల్లిదండ్రులు, బావ సహా కుటుంబ సభ్యుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









