AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణ అంచనా: పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం (నవంబర్ 5, 2025) పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (DM) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఈ ఆవర్తనం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని DM హెచ్చరించింది.

ఇక తెలంగాణలో నవంబర్ 6 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో ప్రధానంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

 

ANN TOP 10