AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిల్ కౌంటర్ లేని రాయపూర్ సంజీవనీ ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని మోదీ: చిన్నారులతో ముచ్చట

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ ఆస్పత్రి ‘బిల్ కౌంటర్‌ ఊసేలేని’ సంస్థగా పేరుగాంచింది మరియు చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైంది. ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై, వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీకి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఆహ్వానం పలికారు. అనంతరం సత్యసాయి సంజీవనీ ఆస్పత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి సత్యసాయి చిత్ర పటాన్ని అందజేశారు. ప్రధాని ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విగ్రహానికి పూజలు నిర్వహించి, చికిత్సపొందిన చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేశారు. ప్రముఖ క్రికెటర్, ఈ హాస్పిటల్స్ ట్రస్టీల్లో ఒకరైన సునీల్ గవాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌లో భాగమైన ఈ సంజీవనీ ఆస్పత్రులు, ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత పీడియాట్రిక్ కార్డియక్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్‌గా గుర్తింపు పొందాయి. ఈ మిషన్ వందకు పైగా దేశాల్లో వైద్యం, విద్య, పోషకాహార రంగాలలో సేవలందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రులలో 37 వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించారు. అంతేకాక, దేశంలోనే మొట్టమొదటి ఉచిత ప్రైవేటు వైద్య కళాశాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

ANN TOP 10