ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆదివారం (నవంబర్ 2) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా, వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన స్పష్టం చేశారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోందని, వరద ఉద్ధృతిలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 1,67,175 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది.









