భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ‘బాహుబలి రాకెట్’గా పిలిచే ఎల్వీఎం-3 ఎం5 (LVM3 -M5) వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 (CMS-3) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఆదివారం (నవంబర్ 02) సాయంత్రం 5:26 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ LVM-3 M5 రాకెట్ ప్రయోగం ద్వారా 4400 కేజీలు బరువు కలిగిన CMS-03 (GSAT-7R) ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న జీటీఓ కక్ష్య (GTO ORBIT- GEO SYNCHRONOUS TRANSFER ORBIT) లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనున్నారు. ఇంత భారీ ఉపగ్రహాన్ని ఇస్రో షార్ నుండి ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వాతావరణం అనుకూలిస్తే, శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారం ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి ఇస్రో మరో మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నారు.
ఈ CMS-03 ఉపగ్రహం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. 2013లో ప్రయోగించిన జీసాట్-7 ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో, దానికి ప్రత్యామ్నాయంగా ఈ జీసాట్-7ఆర్ (CMS-03)ను పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో పది సంవత్సరాల పాటు పరిభ్రమిస్తూ, భారతదేశంలోని భూభాగంతో సహా మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతం, విస్తృత సముద్ర ప్రాంతంలో మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.









