ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ అనూహ్య వాతావరణ మార్పులతో అక్టోబరు-నవంబరులో శీతాకాలం ఉండాల్సిన సమయంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో సోమవారం మరియు మంగళవారం రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా మంగళవారం వర్షపాతం గరిష్ఠంగా ఉండే అవకాశం ఉంది.
ఈ తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 110 కి.మీల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అధికారులతో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అక్టోబరు-నవంబరు మాసంలో కూడా అల్పపీడనాలతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.









