AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మోంథా’ తుపాను ముప్పు: ఏపీకి రెడ్ అలర్ట్, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి ‘మోంథా’ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ తుపాను ఈ ఏడాది ఏర్పడే తుపానుల్లో అత్యంత బలమైందిగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రస్తుత వాతావరణ విశ్లేషణ ప్రకారం, అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశలో కదిలి అక్టోబర్ 27 ఉదయానికి తుపానుగా, అక్టోబర్ 28 ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను ఉత్తర వాయువ్య దిశలో కదిలి అక్టోబర్ 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున మచిలీపట్నం – కళింగపట్నం మధ్యలో, కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలు సహా అన్ని అత్యవసర సేవల సిబ్బంది సెలవులను రద్దు చేశారు. విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై, ముఖ్యంగా ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలలో, భారీ వర్షాల రూపంలో కనిపించనుంది.

ANN TOP 10