కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నిప్రమాదంలో మంటలు తీవ్రరూపం దాల్చడానికి లగేజీలో ఉన్న వందల మొబైల్ ఫోన్ల పేలుళ్లే ప్రధాన కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ఈ ప్రమాదం బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టడం వల్ల బైక్ ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై, నిప్పురవ్వలు చెలరేగి మంటలు మొదలవ్వడంతో చోటుచేసుకుంది.
మొదటగా మంటలు బస్సులోని లగేజీ భాగానికి వ్యాపించాయి. అక్కడ ఉన్న సుమారు 400కు పైగా మొబైల్ ఫోన్ల పార్సిల్‌కు నిప్పు అంటుకోవడంతో, వాటి బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ భారీ పేలుళ్ల కారణంగా మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సు ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడానికి మొబైల్ ఫోన్ల పేలుళ్లే ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు.
ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన అన్ని కోణాలను పరిశీలిస్తూ, ముఖ్యంగా ప్రయాణికుల బస్సుల్లో సరకులను (మొబైల్ ఫోన్ల వంటి పార్సిళ్లను) తరలించడం వంటి నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే దానిపై కూడా దృష్టి సారించారు.









