AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ నగరం సాఫ్ట్‌వేర్‌, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) హబ్‌గా రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని నానక్‌రామ్‌గూడలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సొనాటా సాఫ్ట్‌వేర్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు సైతం కీలక కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల విధానాల ఫలితంగా కొత్తగా రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయని, తద్వారా లక్షకు పైగా నూతన ఉద్యోగావకాశాలు కూడా సృష్టించబడ్డాయని వివరించారు.

 

రాష్ట్రంలో మరిన్ని ప్రపంచస్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం అనే నాలుగు కీలక అంశాలను సమతుల్యంగా ముందుకు తీసుకువెళుతున్నామని స్పష్టం చేశారు.

 

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బృహత్తర లక్ష్య సాధనకు పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10