పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’కు సంబంధించి ఒక కీలకమైన సమాచారం వెలువడింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, మొదటి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి భాగానికి సంబంధించి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ఆదివారం నాడు పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేసింది. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఈ షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపింది.
“చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ పాటల కోసం సిద్ధంగా ఉండండి! తుఫానుకు కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది” అని నిర్మాత ఏఎం రత్నం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది