సూపర్-6 హామీల అమలుపై ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుండడంతో… సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, ఆ వెంటనే అన్నదాత పథకం తీసుకువస్తామని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
“విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తాం. తల్లికి వందనం పథకంలో… ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం. సాగుకు భరోసా ఇచ్చేలా రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు అందజేస్తాం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థికసాయం చేస్తాం” అని చంద్రబాబు వివరించారు.