ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ ఉండనుందని సమాచారం. అమెరికా పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ విందు కూడా ఇచ్చే అవకాశముంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆయన అమెరికా రాజధానిలోనే ఉంటారు. ఈ రెండు రోజుల పాటు అమెరికన్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో, ఎన్నారైలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మెక్సికోపై అమెరికా సుంకాల విధింపు వాయిదా
తమ దేశంపై సుంకాల విధింపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తెలిపారు. ట్రంప్‌తో ఆమె ఫోన్ కాల్‌లో మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. మెక్సికోతో పాటు కెనడా, చైనాలపై అధిక సుంకాలను విధిస్తామని ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. తాజాగా, మెక్సికోపై మాత్రం సుంకాల విధింపును ట్రంప్ వాయిదా వేసినట్లు క్లాడియా తెలిపారు.