ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఇచ్చిన హామీల అమలు పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అదే విధంగా ఉద్యోగులకు సీపీఎస్ పైన ఫోకస్ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాత్రికేయులు వంటివారి పై మోపిన అక్రమ కేసులపై పరిశీలన జరిపి ఎత్తివేయాలని నిర్ణయించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు పైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది.
పథకాల అమలు
టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలను జూన్ లోగా అమలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ నిధులను మూడు విడతలుగా జమ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను పార్టీ నేతలకు వివరించారు. ప్రఖ్యాత కిమ్స్ ఆస్పత్రి అమరావతిలో మెడికల్ కళాశాల, డీమ్డ్ మెడి కల్ యూనివర్సిటీ పెట్టడానికి ముందుకొచ్చిందని సీఎం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల కు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులు త్వరగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులు.. హత్యల పై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు.
సీపీఎస్ హామీపై
ఇంఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలను ఖరారు చేసారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చినందువల్ల వాటిని విక్రయించి డబ్బులు పంచే బదులు ఆ భూములనే బాధితులకు పంపిణీ చేయడంపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. సౌర విద్యుత్‌ను అందుబా టులోకి తేవడం ద్వారా ఈ ఏడాది కరెంటు కొనుగోలు ఖర్చును యూనిట్‌కు 35 పైసల వరకు తగ్గించడానికి ప్రయత్నించాలనే చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉద్యోగుల పింఛను పథకం(సీపీఎస్)పై పరిశీలన జరిపి వారికి వీలైనంత వరకూ పాత పింఛనుతో సమానంగా కొత్త పింఛను వచ్చే మార్గాలు అన్వేషించాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడు ఈ సారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు.
జిల్లాల పునర్విభజన
మహానాడులోగా పార్టీ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమావేశంలో కీలక మైన జిల్లాల పునర్విభజన పైనా చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, పోలవరం ముంపు మండలాలు కలిపి జిల్లా ఏర్పాటుకు ఇచ్చిన హామీల అమలు పై ఆలోచన చేయాలని నిర్ణయించారు. అదే విధంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పెట్టడం, మదనపల్లె మరీ దూరం కావడంపైనా పరిశీలనకు నిర్ణయించారు. డోన్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కోరారు. దీంతో, త్వరలోనే ఈ ప్రతిపాదనల ఆమోదం దిశగా కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. కూటమి పార్టీల్లో వైసీపీ నేతల చేరిక విషయంలో కూటమి పార్టీలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.