అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, కానీ ఘోరంగా ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఓటమని అంగీకరించాల్సిందేనని చెప్పారు.
వైసీపీకి 11 సీట్లు ఎందుకొచ్చాయో తమకు అర్థం కాలేదని, అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకొచ్చాయో వారికీ అర్థం కాలేదని అంబటి పేర్కొన్నారు. కేవలం ఇద్దరు ముగ్గురు కలవడం వల్లే అన్ని సీట్లు వచ్చాయా? లేదంటే వైసీపీపై తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఇంకేమైనా మాయ జరిగిందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఓడిపోయామని అన్నారు. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే కరణం ధర్మశ్రీని జగన్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారని అంబటి పేర్కొన్నారు